అమరావతి, ఆగస్టు 13 (ప్రతి ఉదయం ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో గురువారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్-1 మూల్యాంకన అంశం చర్చకు వచ్చింది. 97 శాతం జవాబు పత్రాల్లో మార్కుల మార్పులు చోటుచేసుకున్నట్లు నివేదికలో వెల్లడైన అంశంపై సీఎం, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం
డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించినట్లు వచ్చిన వార్తలపై మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వంతో పాటు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని మంత్రులు సీఎంను కోరారు.
మరికొంతమంది అధికారుల పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని.. దీనిపైనా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రూప్-1 వ్యవహారంపై వైసీపీని ఎండగట్టాలని మంత్రులు సూచించారు.
కోర్టు పరిధిలో సిట్ నివేదిక
2011లో మహారాష్ట్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నప్పుడు అభ్యర్థులు పోరాటం చేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. సిట్ నివేదిక ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని అన్నారు.
గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై సమాచారం సేకరించేందుకు పోలీసు శాఖలోని కొంతమంది అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం లభిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పగా.. వారితో వెంటనే మాట్లాడి వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు.
డీఎస్సీపై దీటుగా సమాధానం ఇవ్వాలి
డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని శాసనమండలిలో వైసీపీ లేవనెత్తితే దీటుగా సమాధానం ఇవ్వాలని మంత్రులకు సూచించారు.
వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో సమాధానం ఇవ్వాలని, రాజకీయంగా కూడా బలంగా కౌంటర్ ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. డీఎస్సీపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసే వారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలని సూచించారు.
అమరావతిలో వరుస ప్రారంభోత్సవాలు
రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇక వరుసగా ప్రారంభోత్సవాలు నిర్వహిద్దామని మంత్రులతో అన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ ఓఆర్‌ఆర్, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో తన అనుభవాలను మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు.