ఎన్టీఆర్‌ హయాంలో ఉన్న రాజకీయాలు మళ్లీ రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కన్నా లక్ష్మీనారాయణను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ఆరుసార్లు గెలిచిన కన్నా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కొనియాడారు.

గుంటూరు జిల్లా, ఆగస్టు 13 (ప్రతి ఉదయం ప్రతినిధి): దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కన్నా లక్ష్మీనారాయణను చూసి చాలా నేర్చుకోవాలని సూచించారు.

గురువారం గుంటూరు జిల్లా వేదికగా మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఓటు వేసిన తర్వాత రెండోసారి అదే నాయకుడికి ఓటు వేయడం లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ కన్నా లక్ష్మీనారాయణ ప్రజల మనసు గెలుచుకుని ఆరుసార్లు విజయం సాధించారని గుర్తుచేశారు.

కన్నా రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు

కన్నా లక్ష్మీనారాయణలోని క్రమశిక్షణ, తనను కలవడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించడం, ప్రజల పని అవుతుందని భావిస్తే చేసి పెట్టడం ఆయన ప్రత్యేకతలని అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు.ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీర్చేలా కన్నా పనిచేశారని కొనియాడారు. ఆయన మాదిరిగా మిగిలిన రాజకీయ నాయకులు కూడా ప్రజల కోసం పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

రాజకీయాలు వ్యాపారంగా మారాయి

గతంలో ప్రజలు, నాయకుల మధ్య ఉన్న సంబంధాలు ఇప్పుడు కనిపించడం లేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. పూర్వం ఉన్న నాయకులు ఇప్పుడు లేరని, రాజకీయాలు ప్రస్తుతం వ్యాపారంగా మారిపోయాయని విమర్శించారు.
కన్నా లక్ష్మీనారాయణ మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.