హైదరాబాద్, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్మీ నియామకాలు, విపత్తు నిర్వహణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించారు.
జిల్లా కేంద్రాల్లో ఆర్మీ శిక్షణ
భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్మీ ఉద్యోగాల్లో స్థానిక యువతకు భారీగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆసక్తి, అనుకూలత ఉన్న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఈ ప్రతిపాదనపై లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్‌మెంట్లకు ముందుగా తెలంగాణలోని ఆయా జిల్లా కేంద్రాల్లో యువత కోసం శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.
విపత్తు నిర్వహణలో ఆర్మీ సేవలు
రాష్ట్రంలో వరదలు, ఇతర విపత్తుల సమయంలో ఆర్మీ మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
తెలంగాణలో విపత్తు పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకునేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తామని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తెలిపారు.
మూసీ ప్రక్షాళనకు ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ ప్రశంసించారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు, నగర చారిత్రక వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మూసీ నది పునరుజ్జీవనం అవసరమని పేర్కొన్నారు.
ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.