అమరావతి, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): మాషా అల్లా స్కాం బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మాషా అల్లా స్కాం బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది బాధితులు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ స్కాంపై తక్షణమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనిత హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్‌తో కూడా మాట్లాడినట్లు తెలిపారు.
ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు ఆర్థిక మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు ఇస్తామని చెప్పే మోసపూరిత హామీలను నమ్మవద్దని హెచ్చరించారు.
పేదల కష్టార్జితాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
తండ్రి–కుమార్తెకు హోంమంత్రి సాయం
నాయుడుపేట నుంచి టీడీపీ గ్రీవెన్స్‌కు వచ్చిన ఓ తండ్రి, ఆయన ఏడేళ్ల కుమార్తెకు హోంమంత్రి అనిత సాయం చేశారు. తండ్రికి ఉపాధి కల్పించడంతో పాటు కుమార్తెకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడమే టీడీపీ గ్రీవెన్స్ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.