ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. అయితే శాసనమండలి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించింది. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అమరావతి, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలి సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్ష హోదాపై వైసీపీ అభ్యంతరం

అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు.

అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని బొత్స వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీకి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.